ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఎప్పుడో పదేళ్ల క్రితమే పరుచూరి బ్రదర్స్ ‘సైరా’ స్క్రిప్ట్ రాశారు. స్టార్ రైటర్స్ గా టాలీవుడ్ ని ఏలిన ఈ స్టార్ రైటర్స్ ఒక స్క్రిప్ట్ ను పదేళ్ల పాటు ప్రేమించి రాశారు అంటే.. ఖచ్చితంగా ఆ స్క్రిప్ట్ ఓ రేంజ్ లో ఉండి ఉండాలి. కానీ, పరుచూరి బ్రదర్స్ రాసిన ‘సైరా’ స్క్రిప్ట్ ని తానూ తీసుకోలేదని.. తానే మిగిలిన రచయితల సాయంతో నరసింహారెడ్డి జీవితం పై ఎంతో రీసెర్చ్ చేసి ‘సైరా’కి సంబధించి కొత్త స్క్రిప్ట్ ను రాసుకున్నానని, ఆ స్క్రిప్ట్ నే సినిమాగా మలిచానని దర్శకుడు సురేందర్ రెడ్డి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మరి ఈ వ్యాఖ్యల పై పరుచూరి బ్రదర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రాబోతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.