Krishnarao Super Market Telugu Movie Review and Ratting
విడుదల తేదీ : అక్టోబర్ 18, 2019
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు : కృష్ణ, ఎల్సా ఘోష్, గౌతమ్ రాజు,తణికెళ్లభరణి, బెనర్జీ, రవి ప్రకాష్, సూర్య, సనా తదితరులు
దర్శకత్వం : శ్రీనాథ్ పులకురమ్
నిర్మాతలు : బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్
సంగీతం : బోలె షావలి
సినిమాటోగ్రఫర్ : ఏ.విజయ్ కుమార్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
ప్రముఖ కమెడియన్ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’. యువ దర్శకుడు శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
ఒక కిక్-బాక్సింగ్ ట్రైనీ అయిన అర్జున్ (కృష్ణ) సంజన (ఎల్సా ఘోష్)తో ప్రేమలో పడతాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఇద్దరూ ఒకర్ని ఒకరు ప్రేమించుకుంటారు, ఇక వాళ్ళ లైఫ్ లో అంతా హ్యాపీనే అనుకుంటున్న టైంలో సడెన్ గా సంజనను ఓ సైకో కిల్లర్ హత్య చేస్తాడు. సంజన చావుతో అర్జున్ లైఫ్ ఎలా మారింది ? అసలు సంజనను చంపిన ఆ సీరియల్ సైకో కిల్లర్ ఎవరు? అతను సంజనను ఎందుకు చంపాడు ? అర్జున్ హంతకుడిని ఎలా కనుగొని ప్రతీకారం తీర్చుకున్నాడు ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో హీరోగా నటించిన కృష్ణ చక్కగా నటించాడు. ముఖ్యంగా అతని పై వచ్చే కొన్ని కిక్-బాక్సింగ్ పరిచయ దృశ్యాలు బాగున్నాయి. మొదటి సినిమా అయినా తన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే సినిమాలో హీరోయిన్ గా ఎల్సా ఘోష్ అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి.
అదేవిధంగా బీచ్ లో వచ్చే సాంగ్‌లో తన గ్లామర్ షోతోనూ ఎల్సా ఘోష్ యూత్ ను అట్రాక్ట్ చేయడానికి విశ్వప్రయత్నాలు చేసింది. ఆ విషయంలో ఆమె బాగానే సక్సెస్ అయింది అనుకోవచ్చు. ఇక హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించిన సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి మరియు సైకో కిల్లర్ పాత్రలో నటించిన నటుడు బాగా నటించారు. ఇతర కీలక పాత్రల్లో నటించిన రవిప్రకాష్, గౌతమ్ రాజు, బెనర్జీ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు శ్రీనాథ్ పులకురమ్ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేదు. దీనికి తోడు సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి తప్ప, ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు. సినిమాను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం ఆ దిశగా సినిమాని మలచలేదు.
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. ఇక సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని శ్రీనాథ్ ప్రయత్నం చేశారు, కాకపోతే అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. హీరోయిన్ మీద జరిగే దాడి కూడా మరీ సినిమాటిక్ గా ఉంటుంది.
మెయిన్ గా సినిమాలో ఎదో కాన్ ఫ్లిక్ట్ రావాలి గనుక పెట్టినట్లుగా అనిపిస్తోంది తప్పా.. ఎక్కడా బలమైన కాన్ ఫ్లిక్ట్ లేదు. ఓవరాల్ గా ఈ చిత్రం నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. దర్శకుడు ఉన్న కంటెంట్ ను కూడా బాగా ఎలివేట్ చేయలేకపోయారు. ఆయన స్క్రిప్ట్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు బోలె షావలి అందించిన నేపధ్య సంగిగం పర్వాలేదు. అయితే లవ్ స్టోరీకి ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా ప్లస్ అయింది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా లేదు. సినిమాని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. ఏ.విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. కీలక సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. ఇక నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి.
తీర్పు :
కృష్ణ, ఎల్సా ఘోష్ హీరోహీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ క్రైమ్ డ్రామా. ఏ మాత్రం ఆసక్తికరంగా సాగలేదు. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగున్నా.. ఓవరాల్ గా సినిమాని మాత్రం దర్శకుడు శ్రీనాథ్ ఆసక్తికరంగా మలచలేకపోయారు. ముఖ్యంగా ఆయన సెకండాఫ్ లో సాగతీత సన్నివేశాలతో విసుగు తెప్పిస్తారు. మొత్తం మీద ఈ చిత్రం నిరాశ పరుస్తోంది.