విడుదల తేదీ : నవంబర్ 8, 2019
123తెలుగుTV.IN రేటింగ్ : 1.75/5
నటీనటులు : అనిల్ మొగిలి, రేయాన్ రాహుల్, సునీత
దర్శకత్వం : కె బి కృష్ణ
నిర్మాతలు : మచ్చ వెంకట్ రెడ్డి, భట్టు అంజిరెడ్డి, పల్లె వినయ్ కుమార్
సంగీతం : సత్య కశ్యప్
సినిమాటోగ్రఫర్ : ఈరుపుల శ్రీకాంత్
అనిల్ మొగిలి, రేయాన్ రాహుల్, సునీత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కోనాపురంలో జరిగిన కథ’. ఈ చిత్రాన్ని పోషం మట్టారెడ్డి సమర్పణలో అనూష సినిమా పతాకంపై మచ్చ వెంకట్ రెడ్డి, భట్టు అంజిరెడ్డి, పల్లె వినయ్ కుమార్ నిర్మించారు. కె బి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
కోనాపురంలో అలాగే పక్క గ్రామంలో పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి పదిహేను రోజులకు వరుసగా ఒకొక్కరు హత్యకు గురవుతూ ఉంటారు. దాంతో ప్రశాంతంగా ఉన్న ఆ రెండు ఊర్లు ఆ వరుస హత్యలతో ఉలిక్కి పడతాయి. ఇంతకీ ఆ హత్యలు ఎలా జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? హత్యలు చేస్తోన్న అతన్ని పట్టుకోవడానికి ఎలాంటి విచారణలు జరుగుతున్నాయి? ఇక ఈ మధ్యలో అదే గ్రామంలో ఉండే సూరి (అనిల్ మొగిలి) తాను ప్రేమిస్తోన్న వెన్నెల (సునీత)కు తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడు. ఆమె అతని ప్రేమను అంగీకరించిందా? వాళ్లిద్దరూ ఒక్కటవుతారా? చివరికీ హత్యలు చేస్తోన్న వ్యక్తి దొరుకుతారా? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర ఈ సినిమాని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
పెళ్లి కానీ అమ్మాయిలు అబ్బాయిలు మాత్రమే ఎందుకు హత్య చేయబడుతున్నారు.. ఇంతకీ ఎవరు హత్య చేస్తున్నారు అనే ఉత్కంఠను పెంచటానికి దర్శకుడు ఓ ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన అనిల్ నటించటానికి బాగానే కష్ట పడ్డాడు. తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. అలాగే ప్రధాన పాత్రల్లో నటించిన రేయాన్ రాహుల్, దేవా చాల బాగా నటించారు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ సన్నివేశంలో కూడా వారి నటన చాల బాగుంది.
ఇక హీరోయిన్ గా నటించిన సునీత కొన్ని లవ్ సీన్స్ లో అవలీలగా నటించింది. నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంది. అలాగే మరో కీలక పాత్రలో నటించిన శ్వేత నటన పర్వాలేదు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు బాలకృష్ణ సినిమాకి కావాల్సిన ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ అయితే రాసుకున్నాడు గాని, వాట్ని స్క్రీన్ మీద అంతే బలంగా తెరకెక్కించలేకపోయాడు. అలాగే కథాకథనాల్లోనూ సరైన ప్లోను మెయింటైన్ చేయలేకపోయాడు. అనవసరమైన కామెడీ సీన్స్ పెట్టి.. పైగా అవే సీన్లను అటు తిప్పి, ఇటు తిప్పి.. చాలా టైమ్ వేస్ట్ చేసారు. సినిమాలో చాలా భాగం ఏ మాత్రం ఇంట్రస్ట్ లేని సాగతీత బోరింగ్ సీన్ల తంతుగానే సాగుతుంది. క్లైమాక్స్ ను కూడా చిన్న ఫైట్ పెట్టి మమ అనిపించేసారు.
Latest Telugu Movie Reviews:-
అయితే సెకెండ్ హాఫ్ లో రివీల్ అయ్యే ఫ్లాష్ బ్యాక్ లో కొన్ని ఇంట్రస్టింగ్ ఎలెమెంట్స్ ఉన్నా.. స్క్రీన్ ప్లే పట్టు లేకపోవడంతో అవి కూడా తేలిపోయాయి. ముఖ్యంగా పేలని కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ తో కథను డైవర్ట్ చేసారు. అసలు సినిమాలోని మెయిన్ పాయింట్ లోనే ఒక పెయిన్ ఫుల్ కంటెంట్ ఉన్నా.. దర్శకుడు ఆ కంటెంట్ ను సరిగ్గా ఎలివేట్ చేయలేదు. ఓవరాల్ గా సినిమా ఇంట్రస్ట్ కలిగించలేని సీన్స్ తో సాగుతూ బోర్ కొడుతోంది. దర్శకుడు బాలకృష్ణ స్క్రిప్ట్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే సినిమాకి చాలా ప్లస్ అయి ఉండేది.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు కొన్ని చోట్ల డైరెక్షన్ పరంగా పర్వాలేదనిపించినా… ఆకట్టుకునే విధంగా స్క్రిప్ట్ ను రాసుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యారు. సంగీత దర్శకుడు సత్య కశ్యప్ అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తోంది. ఇక హరి ఎడిటింగ్ బాగాలేదు. సెకండాఫ్ ను ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. శ్రీకాంత్ ఎరుపుల సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే అనిపిస్తోంది. అయితే కొన్ని కీలక సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. ఇక నిర్మాతలు మచ్చా వెంకటరెడ్డి, బట్టు అంజిరెడ్డి, పల్లె వినయ్ కుమార్ పాటించిన నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి.
తీర్పు :
బాలకృష్ణ దర్శకత్వంలో అనిల్ మొగిలి, రేయాన్ రాహుల్, సునీత ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా కొన్ని లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ తో సాగిన.. సినిమా మాత్రం ఆసక్తికరంగా సాగదు. కథా కథనాల్లో సరైన ప్లో లేకపోవడం, సినిమా ఇంట్రస్ట్ కలిగించలేని సీన్స్ తో సాగుతూ బోర్ కొట్టించడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని పూర్తిగా దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ చిత్రం నిరుత్సాహ పరుస్తోంది.
123teluguTV.IN Rating : 1.75/5
123teluguTV.IN Rating : 1.75/5
Reviewed by 123teluguTV Team